PHCs in Telangana 2023 : వైద్య ఆరోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. మానవ వనరులను హేతుబద్దీకరించాలని నిర్ణయించింది. అధికంగా ఉన్న చోట సిబ్బంది బదిలీ సహా నిరుపయోగంగా ఉన్న సంస్థల మూసివేతకు ఆదేశించింది. హైదరాబాద్‌లో కొత్తగా 5 డీఎమ్‌హెచ్‌వో కార్యాలయాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 40 కొత్త పీహెచ్‌సీలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Telangana PHCs Expansion 2023 : ఈ మేరకు ప్రస్తుతం డీపీరెచ్ పరిధిలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అధికంగా ఉన్న సిబ్బందిని అవసరమైన చోటుకు బదిలీ చేసేందుకు ఆదేశించింది. అవసరం లేని.. నిరుపయోగంగా ఉన్న సంస్థలను మూసేసి అక్కడున్న సిబ్బందిని ఇతర చోట్లకు బదలాయించాలని నిర్దేశించింది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని ప్రభుత్వ టీబీ శానిటోరియంని వైద్యవిద్య సంచాలకులు డీఎమ్‌ఈ పరిధిలోకి మార్చింది. మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డీపీపెచ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్న యోచనతో మంత్రి హరీశ్‌రావు.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికకు అనుగుణంగా మానవవనరుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.
Meals At Hospitals: ఆస్పత్రుల్లో వారికి రూ.5 కే భోజనం.. నేడే ప్రారంభం
Telangana Health Ministry Updates : రాష్ట్రంలో 636 పీహెచ్‌సీలుండగా ప్రభుత్వం 40 మండలాలకు కొత్తగా వాటిని మంజూరు చేసింది. మరో 30 పీహెచ్‌సీలను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చింది. వాటిని వైద్య విధాన పరిషత్‌కి బదలాయించింది. వాటికి తోడు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏక రీతిగా పంపిణీ జరగలేదు. పీహెచ్‌సీలన్నింటిలో ఒకేవిధంగా నియామకాలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్రంలోని 235 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి.. తగిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు హేతుబద్ధీకరణ ప్రక్రియే సరైన మార్గమని భావించింది.
హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా పలుచోట్ల అధికంగా ఉన్న సిబ్బందిని స్థానచలనం చేసేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. కొత్త డీఎమ్‌హెచ్‌వో కార్యాలయాలకు సిబ్బందిని బదలాయించి... అన్నిచోట్ల ఒకేలా ఉండేలా సర్దుబాటు చేస్తారు. పీహెచ్‌సీల్లోనూ ఏక రీతిని సిబ్బంది సంఖ్య నిర్ధరించి.. అందుకు అనుగుణంగా బదలాయిస్తారు. ఆరోగ్య కేంద్రాల్లో అధికంగా ఉన్నవారిని ఇతర చోట్లకు బదిలీ చేస్తారు.
దేశంలోనే ఎత్తైన ప్రభుత్వ ఆస్పత్రిగా కొత్తపేట 'టిమ్స్'
జీఎమ్‌హెచ్‌వో కార్యాలయాలు, పీహెచ్‌సీలు, ఇతర సంస్థల్లో మంజూరైన వారికంటే ఎక్కువగా ఉంటే బదిలీలు చేపట్టాలి. కౌన్సెలింగ్ ద్వారానే ఆ ప్రక్రియ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి చోట జూనియర్లను బదిలీ చేయాలి.. బదిలీ ఉత్తర్వులు మూడు నెలల తర్వాతే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఐతే మహిళా బహుళ విధ ఆరోగ్య సహాయకులను హేతుబద్ధీకరణ నుంచి మినహాయించారు. ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలు, ఇతర సంస్థల్లో వారికి మంజూరైన 4,246 పోస్టులు యథాతథంగా ఉంటాయని.. ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.