పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, ఇతర సామాగ్రి రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ భారాన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు నేరుగా వినియోగదారులపై వేస్తున్నాయి. నిత్యావసరాలన్నింటి ధరల పెరుగుదలకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఒక కారణంగా వ్యాపారస్థులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్ దాటగా.. మరో పది జిల్లాల్లో 99రూపాయలు దాటి వందకు చేరువలో ఉంది. కరోనా కారణంగా వ్యక్తిగత వాహనాలు వాడకం పెరిగింది. గతంలో ద్విచక్రవాహనదారుడు పెట్రోల్ కోసం.. నెలకు 12 నుంచి 15వందలు వెచ్చిస్తే ఇప్పుడు కనీసం రెండున్నర వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
5 జిల్లాల్లో..
ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. నిజామాబాద్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 89 పైసలు ఉండగా వంద రూపాయల 17పైసలకు పెరిగింది. డీజిల్ ధర కూడా 94 రూపాయల 95 పైసలకు చేరింది. ఆదిలాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల 45పైసలు, జోగులాంబ గద్వాల్లో రూ.100.45, కుమురంభీం ఆసిఫాబాద్‌లో రూ.100.11, నిర్మల్‌లో వంద రూపాయల మూడు పైసలు పెరిగింది. కరోనాతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో... ఇష్టానుసారంగా పెట్రోల్ ధరలు పెంచడం దారుణమని సామాన్యులు మండిపడుతున్నారు.
జిల్లా పేరు | పెట్రోల్ ధర(లీ.కు) |
నిజామాబాద్ | రూ.100.17 |
ఆదిలాబాద్ | రూ.100.45 |
జోగులాంబ గద్వాల | రూ.100.45 |
కుమురంభీం ఆసిఫాబాద్ | రూ.100.11 |
నిర్మల్ | రూ.100.03 |
పెరిగిన చమురు ధరలు
గత నెలలో చమురు ధరలు 16సార్లు పెరగ్గా.. ఈ నెలలో ఇప్పటివరకు రెండుసార్లు పెరిగాయి. మే నెల ఆరంభం నుంచి.. లీటర్ పెట్రోల్‌పై 4 రూపాయల 36 పైసలు, డీజిల్‌పై 4 రూపాయల 93 పైసల చొప్పున పెరిగింది.
ఇదీ చదవండి: Petrol Price : రాష్ట్రంలో 5 జిల్లాల్లో రూ.100 దాటిన పెట్రోల్ ధర