High Court allowed YS Sharmila to padayatra: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పాదయాత్ర, సమావేశాల కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని వైతెపాకు ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే సీఎం కేసీఆర్‌తో పాటు రాజకీయ, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని ఆమెకు హైకోర్టు స్పష్టం చేసింది. షర్మిల పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారంటూ వైతెపా సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి అత్యవసర విచారణ చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పటికీ.. ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని రవీంద్రనాథ్ రెడ్డి తన పిటిషన్లో తెలిపారు. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ వద్ద మెప్పు పొందేందుకు వాహనం తగలబెట్టి పాదయాత్ర అడ్డుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యకర్తలు సృష్టించిన ఉద్రిక్తతలను అడ్డుపెట్టుకొని పోలీసులు తమ పాదయాత్రకు అనుమతి రద్దు చేయడం తగదని వాదించారు. షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు సున్నితమైన రాజకీయ, మతపరమైన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని హోంశాఖ తరపు న్యాయవాది తెలిపారు.
షర్మిల గతంలో తీసుకున్న అనుమతి గడువు నిన్నటితోనే ముగిసిందని గుర్తుచేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. పాదయాత్ర అనుమతి కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని వైతెపాకు సూచించింది. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని షర్మిలకు షరతులను విధించింది.
అసలేం జరిగింది: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో.. ప్రచారం రథంపై దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ షర్మిల ప్రగతిభవన్ వైపు వెళ్తుండగా.. పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు షర్మిలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆమెను కారులో నుంచి దించే ప్రయత్నం చేయగా.. కారు కిటికీలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు.
ఇవీ చదవండి: