హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని పీసీసీ బృందం కలిసింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని... పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చైర్మన్కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడటానికి మూలసూత్రం... నిధులు, నియమాకాలు, నీళ్లు అని శ్రీనివాస్ అన్నారు. కానీ ప్రస్తుతం వాటికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. శాసనమండలి ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించిన 50వేల ఉద్యోగాలతో పాటు... ఖాళీగా ఉన్న 1.90వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని కోరారు.
గ్రూపు 1, 2, 3 నోటిఫికేషన్ల కోసం కొన్ని ఏళ్ల నుంచి ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని... తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల వివరాలు తెప్పించుకొని... అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఉద్యోగాలకు తావివ్వకుండా... పదోన్నతుల పేరు మీద ఉద్యోగ నియాయమకం జరుగుతుందని... దీనికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని కోరారు. 45 రోజుల్లో ఖాళీలపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా