Pawan Kalyan Announced Financial Assistance: గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురైన వారిని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఒక్కో బాధితుడికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ త్వరలోనే అందజేయనున్నట్లు జనసేన పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి ఆర్ధికంగా అండగా నిలబడాలని పవన్ నిర్ణయించినట్లు మనోహర్ పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, అందుకు కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మనోహర్ అభిప్రాయపడ్డారు.
జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరించి, ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయించారని ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. అందుకే పవన్ కల్యాణ్ స్వయంగా ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారని తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్నా.. ధైర్యం కోల్పోని ఇప్పటం వాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించినట్లు తెలిపారు. గ్రామస్థులకు నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా అండగా నిలబడాలని లక్ష రూపాయల సాయం ప్రకటించినట్లు వివరించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కల్యాణ్స్వయంగా అందచేస్తారని చెప్పారు.
ఇవీ చదవండి