తిరుపతి ఉప ఎన్నికకు ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్‌కు వెళ్లి.. కలెక్టర్ చక్రధర్‌బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు వీఆర్‌సీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆదిమూలపు సురేశ్, గౌతం రెడ్డి, అనిల్ కుమార్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు.
భాజపా అభ్యర్థి రత్నప్రభ...
తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబుకు నామపత్రాలు అందజేశారు. ఆమె వెంట భాజపా నేతలు సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, ఆదినారాయణరెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
కాంగ్రెస్, సీపీఎం తరఫున..
తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ నామినేషన్ సమర్పించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో నామపత్రాలు సమర్పించారు. సీపీఎం అభ్యర్థిగా యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టర్ చక్రధర బాబుకు నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు వి.ఆర్.సి. కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా.. తెదేపా నుంచి పనబాక లక్ష్మి ఉప ఎన్నిక బరిలో ఉన్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్