కోర్టు కేసుల పట్ల రాష్ట్రంలోని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో నల్గొండ జిల్లా కలెక్టర్‌కు విధించిన శిక్షే ఓ ఉదాహరణ అని పద్మనాభ రెడ్డి తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అధికార యంత్రాంగం వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకి రాసిన లేఖలో కోరారు.
హైకోర్టు ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌కు సింగిల్ జడ్జి వేసిన ఆరు నెలల జైలు శిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. దానిపై స్పందించిన కోర్టు తమ నుంచి ఎలాంటి సాయం ఆశించవద్దని అసంతృప్తి వ్యక్తం చేయడం అధికారుల పనితీరుకు నిదర్శనమని పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎక్కువ సంఖ్యలో ఉన్న కోర్టుధిక్కార కేసులు అధికారుల్లో జవాబుదారితనం లేకపోవడానికి నిదర్శనంగా మారుతున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అన్నారు.
ప్రజలను పట్టించుకోరు
ప్రజల అర్జీలకు అధికారులు ఏమాత్రం స్పందించరని పద్మనాభ రెడ్డి తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ, హోమ్ శాఖల్లో జరిగే అవకతవకల గురించి ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసినా ఎలాంటి చర్యలుండవని... సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోవాల్సి వస్తోందని పద్మనాభ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: 'అలా ముందుకు సాగితే.. అనుకున్నది సాధ్యం'