Green Channel: హైదరాబాద్ నగరంలో రాచకొండ పోలీసులు మరోసారి గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసి దిగ్విజయంగా అవయవాలను రవాణా చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి కేవలం 16 నిమిషాల్లో గుండె, ఊపిరితిత్తులను అంబులెన్స్‌లో తరలించారు. ఉదయం 10.01 గంటలకు బయలుదేరిన అంబులెన్స్.. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 17.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో అధిగమించి.. 10.17 గంటలకు కిమ్స్‌కు చేరింది. ఈ మేరకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులను ఆస్పత్రుల యాజమాన్యం, సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.
మరణిస్తూ ఇద్దరికి ప్రాణం పోశారు
నల్గొండ జిల్లా మునుగోడు వద్ద ఈ నెల 5న ఆండాలు(40) అనే కూలీ.. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయిందని కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వారు ఆండాలు అవయవాలు(గుండె, ఊపిరితిత్తులు) దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో సకాలంలో అవయవ మార్పిడి కోసం చేశారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెకప్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో సిబ్బంది వాక్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ జెండా ఊపి వాక్ని ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల్లో, బాలికల్లో స్ఫూర్తిని నింపేందుకు, సాధికారత కల్పించేందుకు వాక్ నిర్వహించడం గర్వకారణమని డిప్యూటీ మేయర్ అన్నారు.
మహిళల ఆరోగ్యానికి కామినేని ఆస్పత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రతి మహిళకు అందుబాటు ధరలో ఉండేలా ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ప్యాకేజీని ప్రవేశపెడుతున్నట్లు కామినేని సీఈవో గాయత్రి తెలిపారు. మహిళలందరూ ఈ ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: Women in Social Service: అభాగ్యులకు అండగా.. అనాథ మృతదేహాలకు ఆ నలుగురిగా