దేశంలోని ఎక్కడి వారైనా ఎక్కడైనా ప్రభుత్వం అందజేసే నిత్యావసరాలను తీసుకునే విధానానికి సంబంధించిన సమాచారం అన్ని రాష్ట్రాల కార్డుదారులకు పూర్తి స్థాయిలో చేరకపోవటంతో వినియోగించుకునే వారి సంఖ్య నామమాత్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఏడాది ఆగస్టులో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
రేషన్‌కార్డుదారులు తమకు నిర్దేశించిన చౌకధరల దుకాణం పరిధిలోనే ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాలను తీసుకోవాలి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు నిత్యావసరాలు తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో అవి పక్కదారి పడుతున్నాయి. ఈ విధానానికి స్వస్తి పలికేందుకు రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని అమలులోకి తెచ్చింది. రాష్ట్రంలో 87.54 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బియ్యం మాత్రమే కార్డుదారులకు అందజేస్తోంది. ఈ విధానం ద్వారా ప్రతి నెలా సగటున 10 నుంచి 20 శాతానికి పైగా కార్డుదారులు తమకు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా ఉపాధి కోసం వలస వచ్చిన ప్రాంతంలో నిత్యావసరాలు తీసుకుంటున్నారు.
జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు
ఒకే దేశం.. ఒకే రేషన్.. పేరుతో ఈ ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఒక్కో రాష్ట్రంలో ఆహారపు అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా అందజేసే సరకులను మాత్రమే ఈపథకం కింద కేటాయిస్తుండటం ప్రజామోదాన్ని పొందకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
స్పందించని ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్‌కార్డుదారులు గడిచిన రెండు నెలలుగా ఒకే దేశం.. ఒకే రేషన్ పథకంలో తెలంగాణలో నిత్యావసరాలు తీసుకోలేకపోతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా పోర్టబిలిటీ విధానం అమలు కావటం లేదు. ఈ అంశాన్ని ఇప్పటికే ఏపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదని తెలిసింది.
తెలుగు క్లస్టర్‌లో 12 రాష్ట్రాలు
ఏ ప్రాంతాలకు ఎక్కడి వారు ఉపాధి కోసం వలస వెళతారన్న అంచనాల మేరకు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని క్లస్టర్లుగా విభజించింది. దీని పరిధిలోని రాష్ట్రాల రేషన్‌కార్డుదారులకు ఎక్కడైనా నిత్యావసరాలు తీసుకునే వెసులుబాటు ఉంది. తెలుగు రాష్ట్రాల క్లస్టర్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గోవా, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.
గడిచిన ఐదు నెలల్లో ఒక్క ఫిబ్రవరి నెలలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్డుదారులు అధికంగా 583 మంది ఒకే దేశం.. ఒకే రేషన్ కింద.. నిత్యావసరాలు తీసుకున్నారు. తెలంగాణలో మాత్రం ఈ విధానంలో లక్షల సంఖ్యలోనే కార్డుదారులు ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర పోర్టబిలిటీ కింద నిత్యావసరాలు తీసుకుంటున్నారు. అధిక శాతం మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో ఎక్కువగా పొందుతున్నారు.