ఇంట్లో భార్య పోరును భరించలేక పోయాడో వ్యక్తి. ఇందుకు మరణమే శరణ్యమని భావించాడు. ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. దూకేందుకు యత్నించి ప్రాణభయంతో తల్లడిల్లుతున్న సదరు వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఓ దిల్లీ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకుందామని భావించిన ఓ వ్యక్తి (32) స్థానిక ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకే క్రమంలో ఫ్లైఓవర్ సిమెంటు రెయిలింగ్‌ను పట్టుకొని వేలాడుతూ సహాయం కోసం అర్థిస్తున్నాడు.
ఇది గమనించిన ఇద్దరు బైక్ పెట్రోలింగ్ పోలీసులు బారికేడ్ పికెట్ల వద్ద విధుల్లో ఉన్న మరో ముగ్గురు పోలీసులను అప్రమత్తం చేశారు. అనంతరం వారంతా ఆ వ్యక్తి దగ్గరికి చేరుకొని అతడి రెండు చేతులను గట్టిగా పట్టుకున్నారు. అంతలోపు మిగతా ముగ్గురు పోలీసులు అతడు కిందపడితే ప్రమాదం జరగకుండా ఉండేందుకు చెత్త తరలించే ఓ లారీని అతడు కిందపడే చోట ఆపించారు. అంతలోపే పైనున్న ఇద్దరు పోలీసులు ఎలాగోలా పైకి లాగి ఆ వ్యక్తిని కాపాడారు. అనంతరం పోలీసులు అతడిని ప్రశ్నించగా ఇంట్లో భార్య తరచూ గొడవపడుతోందని అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. ‘సదరు వ్యక్తి నిరుద్యోగి. ఏదైనా పనిచేసుకోవాలని భార్య తరచూ మందలిస్తుండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు’. అని పోలీసు అధికారి పేర్కొన్నాడు.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు