ఆపత్కాలంలో ప్రజారవాణాకు ఓలా క్యాబ్‌లకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యవసర వైద్య, రవాణా సేవలకు ఓలా క్యాబ్స్ ముందుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వెల్లడించింది. ఓలా సేవలపై రవాణా, పోలీసుశాఖ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ రవాణాశాఖ అధికారి కృష్ణబాబు తెలిపారు. డయాలసిస్, క్యాన్సర్, గుండెజబ్బు, తదితర రోగులకు ఓలా సేవలు అందనున్నట్లు వెల్లడించారు. కరోనా లక్షణాలు లేని రోగులకే ఓలా క్యాబ్స్‌కు అనుమతుంటుందని.. వారి ఇంటి నుంచి ఆసుపత్రికి రాకపోకలకే క్యాబ్‌లు అనుమతిస్తామన్నారు.
కర్ణాటక వైద్యశాఖతో కలసి ఓలా ఈ తరహా సేవలు అందిస్తోందని ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రయోగాత్మకంగా విశాఖలో ఓలా క్యాబ్ సేవలందిస్తుందన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఓలా సేవలు వాడుకోవచ్చని తెలిపారు. వైద్యులు, సిబ్బందికి ఇల్లు, ఆసుపత్రి మధ్య రాకపోకలకే అనుమతుందని వెల్లడించారు. ఓలా క్యాబ్‌లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికే అనుమతుందని.. కారులో భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరని కృష్ణబాబు అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంటీ కృష్ణబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక