New Year Celebrations Telangana : కొవిడ్ వ్యాప్తితో రాష్ట్రంలో కొత్త ఏడాది ఉత్సవాల్లో కాస్తా జోష్ తగ్గినట్లు కనిపించింది. కరోనా నియమ నిబంధనల మధ్యే హైదరాబాద్ నగరవాసులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్నా పెద్ద నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. రిసార్టులు, పబ్బులు డీజే నృత్యాల హోరులో కలిసి ఆడి పాడి సందడి చేశారు. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ వాసులు భౌతిక దూరాన్ని పాటిస్తూ కుటుంబసమేతంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
New Year Celebrations in Hyderabad : తెలుగుతల్లి ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, చార్మినార్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, దుర్గం చెరువు పార్కు వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, అల్కాపురి కాలనీ చౌరస్తా సమీపంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ కేకు కోసి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలతో పాటు సంస్కరణల బాట పడతామని వివరించారు.
నగర శివారు ప్రాంతాల్లో సందడి..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసుల ఆంక్షల వల్ల గతంలో మాదిరిగా కాకుండా ప్రజలు తక్కువ సంఖ్యలోనే బయటకు వచ్చారు. ఎక్కువ శాతం మంది ఇళ్లకు పరిమితం కాగా... మరికొంత మంది శివార్లలోని రిసార్ట్‌లు, గెస్ట్‌హౌజ్‌ల బాట పట్టారు.
హనుమకొండలో అంబరాన్నింటిన సంబురాలు
New Year Celebrations in hanumakonda : హనుమకొండలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఓరుగల్లు వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పలు కళాశాలల్లో యువత నృత్యాలతో అదరగొట్టారు.
ఖమ్మంలో సందడి తగ్గింది..
New Year Celebrations in Khammam : ఆంక్షల నేపథ్యంలో ఖమ్మంలో నూతన సంవత్సర వేడుకల సందడి కాస్త తగ్గింది. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్నిచోట్ల యవత బైక్‌లపై కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. పరస్పరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. లక్కారం చెరువు లేజర్ వెలుగులతో కాంతులీనింది.
కరీంనగర్‌లో హుషారుగా నవ వసంత వేడుకలు
New Year Celebrations in Karimnagar : కరీంనగర్‌లో ప్రజలు నవవసంత వేడుకలను ఆద్యంతం ఆస్వాదించారు. తెలంగాణ చౌక్ వద్ద పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కేకు కోసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరోనా బారినపడకుండా జనం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: New Year 2022: ఒమిక్రాన్ భయాల మధ్యే ఘనంగా వేడుకలు