ప్రైవేటు ఆసుపత్రులపై(PRIVATE HOSPITALS) చర్యలకు కొత్త చట్టం దిశగా యోచిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు(HIGH COURT) ు తెలియజేసింది. ‘‘కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే దానికి పది రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది. తెలంగాణలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం రూ.20 వేలకు మించి జరిమానా విధించడానికి వీల్లేదు. అందుకే కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-2020ను అన్వయించుకోవడంపై పరిశీలిస్తున్నాం. ఈ చట్టం కింద అంబుడ్స్‌మెన్, నియంత్రణ అథారిటీల ఏర్పాటుకు, భారీ జరిమానాలకు అవకాశం ఉంటుంది’’ అని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ‘‘జూన్ 21 నుంచి జులై 3 వరకు 14.68 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. పాజిటివిటీ రేటు తగ్గింది. మొత్తం 231 ఆసుపత్రులపై 594 ఫిర్యాదులందాయి. 22 ఆసుపత్రులకు కొవిడ్ చికిత్సలు రద్దు చేశాం. రూ.1.04 కోట్లు ఫీజులను వాపసు ఇప్పించాం. 1.14 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశాం. ఇంకా 1.75 కోట్ల మందికి వేయాల్సి ఉంది. కొవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని వివరించారు.
కొవిడ్‌పై చర్యలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విద్యా సంస్థలను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నామని ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులకు అనుమతించామని, పరిస్థితిని సమీక్షించి తరువాత నిర్ణయం తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ తెలిపారు. అయితే పరీక్షలు భౌతికంగా నిర్వహిస్తున్నారన్న న్యాయవాదుల వాదనను తోసిపుచ్చుతూ దీనికి సంబంధించి దాఖలైన మధ్యంతర పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం మూసివేసింది.
రాష్ట్రంలో సీరో సర్వేలెన్స్ పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేసింది. నమూనాలు చెన్నైకి పంపామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామనగా.. పూర్తి వివరాలు సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని విభాగాల్లో 35 వేల ఖాళీ పోస్టుల భర్తీకి ఏం చర్యలు చేపట్టారని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికను వచ్చే విచారణకు సమర్పించాలంటూ వైద్యశాఖను ఆదేశించింది.
ధరలపై అధ్యయనానికి కోర్ కమిటీ: కేంద్రం
ఔషధాల ధరల తగ్గింపునకు సంబంధించి కౌంటరు దాఖలు చేయకపోవడంపై కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు బదులిస్తూ దీనిపై ప్రభుత్వం కోర్ కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ అధ్యయనం చేసి ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పర్యావరణ కాలుష్యానికి సంబంధించి అప్పిలేట్ అథారిటీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పిలేట్ అథారిటీని వారంలోగా నియమించి దానికి సంబంధించిన ఉత్తర్వులను తమ ముందుంచాలని ఆదేశించింది. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు, పీసీబీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అథారిటీని ఏర్పాటు చేయడానికి 4 వారాల గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ అభ్యర్థించగా ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చామని, వారంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ విచారణను జులై 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'