కొవిడ్‌లో పలు వేరియంట్లు వస్తున్న తరుణంలో కొత్త వాటిని గుర్తించటంతో పాటు పరీక్ష ఫలితాలను త్వరగా అందించేందుకు తిరుపతి స్విమ్స్‌లో (Tirupati svims) న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్సర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దాని ద్వారా వైరస్‌లో కొత్త రకాలను గుర్తించడంతో పాటు డీఎన్‌ఏ సీక్వెన్స్ ద్వారా జన్యుపరమైన వ్యాధులు ఎలా సంక్రమిస్తాయనే విషయాన్ని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.
మెరుగైన ఫలితాలు
తాజాగా స్విమ్స్ రూ.కోటి వ్యయంతో న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్సర్ పరికరాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీన్ని అమర్చే ప్రక్రియను చేపడుతున్నారు. ఏపీలో ఈ పరికరం ఎక్కడా లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ పరికరం ద్వారా జన్యుక్రమాన్ని కనుగొనేందుకు ఆస్కారం ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా వస్తున్న వైరస్‌లను, వాటిలోని వేరియంట్లను గుర్తించేందుకు ప్రస్తుతం సీసీఎంబీ, పుణెలోని ప్రయోగశాలలపై ఆధారపడాల్సి వస్తోంది.
అక్కడి నుంచి ఫలితాలు రావడం ఆలస్యం అవుతోంది. ఇక్కడే న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్సర్ ఉంటే.. ఈ సమస్య ఉండదని అంటున్నారు. ఇది జన్యు పరివర్తనాలను గుర్తిస్తుందని వైద్యులు చెబుతున్నారు. డెల్టా, ఆల్ఫా ఇలా వివిధ రూపాంతరాలను గుర్తించేందుకూ దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ పరికరం వల్ల జన్యుపరమైన వ్యాధులు ఏ జన్యువు వల్ల వచ్చిందో గుర్తించగలరు.
దాని ఆధారంగా చికిత్స అందించడంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ చేయొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం పరికరాన్ని అమర్చే ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్విమ్స్ డైరెక్టర్ భూమా వెంగమ్మ తెలిపారు.
ఇదీ చూడండి: Electric shock: విద్యుదాఘాతం... 32 గేదెలు దుర్మరణం