శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు కొత్త జిల్లాగా అవతరించింది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లాల్లో ఆదివారం నుంచి పాలనాపరమైన సేవలు ప్రారంభంకానున్నాయి. 9 మండలాలతో ఏర్పడిన ములుగు జిల్లా జనాభా 2.94 లక్షలు. ములుగు కేంద్రంగా పరిపాలన కొనసాగనుంది. ఈ జిల్లాకు కలెక్టర్‌గా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వి. వెంకటేశ్వర్లుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 11 మండలాలతో ఏర్పడిన నారాయణపేట జిల్లా జనాభా 5.04 లక్షలు. నారాయణపేట కేంద్రంగా పరిపాలన కొనసాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఈ జిల్లాకు అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.
కోయిల్‌కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై స్థానికులు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మండలాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచుతూ... ప్రభుత్వం 11 మండలాలతో నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో 12 కొత్త మండలాలను ఏర్పాటు చేసే అవకాశముంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.