భారతీయ చిత్రకళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా నగరంలో జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. కళ నిర్వహణ, జాయ్స్ లైఫ్‌స్టైల్ సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని జాయ్స్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ చిత్రకళ ప్రదర్శనను తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఆచార్య కొదండరామ్, భాజపా నేత రామచంద్ర రావు ప్రారంభించారు.
భాగ్యనగరం చిత్రకళకు కేంద్రంగా మాతోందని.. ప్రపంచ స్థాయిలో మన చిత్రకళకు గుర్తింపు తెచ్చేందుకు జాతీయ స్థాయిలో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదండరామ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్న చిత్రకారులను ఒక వేదికపై తీసుకుని వచ్చి నగరంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని భాజపా నేత రామచంద్రరావు అన్నారు.
జనవరి 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 34 మంది ప్రముఖ చిత్రకారుల చిత్రాలు ఇందులో కొలువుదీరాయని నిర్వహకులు తెలిపారు. గ్రామీణ జీవన విధానం, నాటి, నేటి ప్రజల స్థితిగతులు, హైటెక్ యుగంలో మనిషి ఏవిధంగా మారిపోయాడు, ప్రకృతి సోయగాలు ఇలాంటి ఎన్నో అద్భతమైన చిత్రాలు చిత్రకళాభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి: ముగిసిన ఇండియా జాయ్.. ఆద్యంతం వినోదం