దిల్లీ లలితా కళా అకాడమీలో 61వ జాతీయ కళా మేళా వైభవంగా సాగింది. ఈనెల 4న ప్రారంభమైన మేళాలో... దేశ నలుమూలలకు చెందిన కళాకారుల చిత్రకళలు అలరించాయి. వివిధ ఇతి వృత్తాల్లో చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలు సందర్శకుల మదిని దోచాయి. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబించే కళాఖండాలు కనువిందు చేశాయి.
ప్రత్యేక ఆకర్షణగా తెలుగు కళాకారుల చిత్రాలు..
మేళాలో తెలుగు రాష్ట్రాల కళాకారుల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన చేసిన చిత్రకారులు.. ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ గిరిజన మహిళలు, వారి సంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కల్చర్ పిస్టోరియల్‌తో శ్రీనివాస్ నాయక్ ప్రదర్శించారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ... సిటీ ల్యాండ్ స్కేప్ ఇతివృత్తం చేసిన చిత్రాలను చూపరుల మనసులు దోచుకున్నాయి.
ఇండియన్ రోస్టర్స్ పద్ధతి..
పట్టణ మహిళల భావోద్వేగాలు, టాటూల పట్ల మహిళల ఆసక్తి వంటి అంశాలను హైదరాబాద్‌కు చెందిన విమలాదేవి తమ చిత్రాల ద్వారా తెలిపారు. విజయవాడకు చెందిన కొలుసు సుబ్రహ్మణ్యం ఇండియన్ రోస్టర్స్ పద్ధతి తెలుగు సంక్రాంతి చిహ్నమైన కోడిపందేల్లో కోడిపుంజును గీసి ప్రదర్శనకు ఉంచారు. వివిధ రూపాల్లో పందెంకోడి కళాత్మక చిత్రాలను ఆయన మలిచారు.
జానపద కళలలోని చిత్రభాష, భారతీయ మహిళ సంప్రదాయం వంటి అంశాల ఇతివృత్తంతో విశాఖపట్నానికి చెందిన రవి చిత్రాలు ప్రదర్శించారు. మేళా పట్ల నిర్వాహకులు మరింత ప్రచారం చేయాలని కళాకారులు కోరుతున్నారు. తద్వారా తమ కళకు మరింత ప్రాచుర్యం దక్కుతుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్