National Health Mission employees: జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం.. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వర్తింపజేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమాఖ్య నాయకులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రోగ్రాములలో 127కి పైగా విభిన్న ఉద్యోగాలలో 15వేల మంది వరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు శ్రవణ్ తెలిపారు. తాము చాలీచాలని, అరకొర వేతనాలతో కుటుంబాలను పోషిస్తూ.. జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Telangana Human Rights Commission : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రాష్ట్రాలు సమానపనికి.. సమాన వేతనాలు ఇస్తున్నాని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు అలా ఇవ్వడం లేదన్నారు. కొవిడ్ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన తమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం చప్పట్లు, హెలికాప్టర్లలో పువ్వులు చల్లితే తమ కడుపులు నిండవని.. వేతనాలు పెంచితేనే సంతోషిస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు, బస్తీ దవాఖాన, డయాగ్నోసిస్ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు.
పీఆర్సీ అమలుచేసి.. తమ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు హెచ్ఆర్సీని వేడుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ ఆరోగ్య మిషన్ ఆదేశించిన హెచ్ఆర్సీ తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.