గ్రేటర్ హైదరాబాద్‌లో నిలిచిపోయిన నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి మార్గం సుగమమైంది. వివాదస్పద ఇతర ముద్రల ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు ఉన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో ఈనెల 9న ఉదయం 8 గంటలకు నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెలువడనుంది. ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ భాజపా లీగల్ విభాగం ఇంఛార్జీ ఆంటోనీ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి ఇవాళ మరోసారి విచారణ చేపట్టారు.
ఆ రహస్యం బయటపడుతుంది
ఎస్ఈసీ తన అధికార పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదించారు. ఇతర ముద్రలతో కూడా ఓట్లు వేయవచ్చునని చట్టంలో లేదన్నారు. ఇతర ముద్రల ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే.. ఆ ప్రాంతంలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయన్న రహస్యం బయట పడుతుందని వాదించారు. రకరకాల ముద్రలు వేయలేదని.. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన మరో ముద్రతో మాత్రమే ఓటు వేశారని ఎస్ఈసీ తరఫు న్యాయవాది విద్యా సాగర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ అధికారం ఉన్నదని.. ఎన్నికల నిర్వహణలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు.
మరో ముద్ర ఉంటే..
నేరేడ్‌మెట్ డివిజన్లో ఒక్క పోలింగ్ కేంద్రంలోనే ఈ సమస్య తలెత్తిందని.. పోలింగ్ సిబ్బంది గుర్తించగానే వెంటనే ముద్ర మార్చారని తెలిపారు. పోలింగ్ సిబ్బంది చేసిన పొరపాటుకు.. ఓటర్లను బాధ్యులుగా చేసి ఓట్లను తిరస్కరించడం సమంజసం కాదని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... స్వస్తిక్ కాకుండా పోలింగ్ సిబ్బంది ఇచ్చిన మరో ముద్ర ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఒకవేళ రెండు ముద్రలు కాకుండా మరో ముద్ర ఉంటే.. నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాలన్నారు.
అభ్యంతరాలు ఉంటే... ట్రైబ్యునల్‌కు
ఎన్నికల నిర్వహణలో హైకోర్టు జోక్యం చేసుకోరాదన్న ఎస్ఈ వాదనను మాత్రం తోసిపుచ్చింది. ఇతర ముద్రలు ఉన్న ఓట్లను కూడా లెక్కించి.. ఫలితాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఎన్నికపై అభ్యంతరం ఉంటే అభ్యర్థులు ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చునని పేర్కొంది. నేరేడ్మెట్లో ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో తెరాస అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇతర ముద్రల ఓట్లు 544 లెక్కించాల్సి ఉందని ఎస్ఈసీ తెలిపింది.
ఇదీ చదవండి: ఐటీ వికేంద్రీకరణకు కృషి చేస్తున్నాం : మంత్రి కేటీఆర్