నీతి అయోగ్(Nithi Ayog) జాబితాలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam indo american Cancer Hospital)కి చోటు దక్కడంపై నందమూరి తారకరామారావు కుమారుడు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు హాస్పిటల్ చేసిన కృషికి దక్కిన ప్రతిఫలమిది అని చెప్పుకొచ్చారు. నీతి అయోగ్.. నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ పేరుతో మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఆసుపత్రులు గురించి ప్రస్తావించింది. ఈ నివేదికలో ఏపీలోని శ్రీ సత్యసాయి పుట్టపర్తి వైద్యాలయంకు(Sri Sathya Sai Puttaparthi hospital) కూడా చోటు దక్కింది.
బసవతారకం ఇండో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నీతి అయోగ్ జాబితాలో చేరడం ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపు. దేశానికి ఆసుపత్రి వర్గాలు చేసిన త్యాగం ఎంతో గొప్పది. బసవతారకం కుటుంబంలోని ప్రతి సభ్యుడి తరఫున.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే బసవతారకం తక్కువ ఫీజు వసూలు చేస్తోంది. 2000వ సంవత్సరంలో ప్రారంభమై.. ఇప్పటిదాకా 1, 65, 000 మంది క్యాన్సర్ రోగులకు వైద్య సేవలను అందించింది.
- నందమూరి రామకృష్ణ
10-20% తక్కువ ఛార్జీలు
ఒకే చోట 500 పడకలతో నందమూరి బసవతారకం-రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ పాలకమండలి ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నడుస్తోంది. సొంతంగానే నిర్వహణ ఖర్చులను సమకూర్చుకుంటోంది. మూలధన వ్యయంకోసం గ్రాంట్స్‌పై ఆధారపడుతోంది. అయితే ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల్సిందిగా నీతి అయోగ్ సూచించింది. ప్రైవేటు ఆసుపత్రులకంటే 10-20% తక్కువ ఛార్జీలు అమలుచేస్తోంది. క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తోంది.
100 శాతం పన్ను మినహాయింపు..
బసవతారకం, పుట్టపర్తి ఆసుపత్రులకు విరాళాలు అందించే దాతలకు పన్ను మినహాయింపు 50 శాతానికి పరిమితం చేయకుండా 100 శాతం ఇవ్వాలని నీతి అయోగ్ సూచించింది. ఇటువంటి ఆసుపత్రులకు ప్రభుత్వాల నుంచి సకాలంలో రీఎంబర్స్‌మెంట్ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ప్రస్థావించింది. సకాలంలో బిల్లులు చెల్లించడంవల్ల ఈ ఆసుపత్రులకు వర్కింగ్ కేపిటల్ సమస్య కొంతమేర తీరుతుందని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: Revanth Reddy: కేసీఆర్ గద్దె దిగితేనే ప్రజా సమస్యలకు పరిష్కారం