Nampally Fire Incident Update : హైదరాబాద్ బజార్ ఘాట్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. భవనంలో నమూనాలను క్లూస్ టీం, ఎఫ్ఎస్ఎల్ అధికారులు సేకరించారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు భవనాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో భవనం ఏ మేరకు దెబ్బతిందనే కోణంలో ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. జేఎన్టీయూ బృందం సైతం భవనాన్ని పరిశీలించనుంది. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్ సైతం రసాయన గిడ్డంగిని పరిశీలించారు.
ప్రమాద సమయంలో డ్రమ్ములు పగిలి.. రసాయనాలన్నీ రహదారిపైకి వచ్చి రోడ్డంతా దుర్గందంగా మారింది. చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారింది. కాలు పెడితే జారి కిందపడిపోతుండటంతో.. జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం రసాయనాలపై మట్టి పోశారు. రెండ్రోజుల పాటు సీసీ రోడ్డుపై మట్టిని ఉంచి ఆ తర్వాత ఎత్తేస్తామని జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి కారణమైన రసాయన గిడ్డంగి యజమాని రమేశ్ జైస్వాల్.. ప్రస్తుతం లకిడీకాపూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Massive Fire Accident Nampally : అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలోనే ఉన్న రమేశ్ జైస్వాల్ ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. భవనంలో చిక్కుకున్న వాళ్లను చూసి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదానికి బాధ్యుడిని చేస్తూ రమేశ్‌పై నాంపల్లి పోలీసులు పలు సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
Nampally Fire accident News : రమేశ్ నిర్వహిస్తున్న శ్రీబాలాజీ ఎంటర్‌ప్రెజెస్‌లోనూ పోలీసులు తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న దస్త్రాలను సీజ్ చేశారు. దుకాణానికి సమీపంలోనే ఉన్న తన ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రమేశ్ రసాయన గిడ్డంగి నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గిడ్డంగికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తేల్చారు. దాదాపు 25 ఏళ్లుగా తన భవనంలోనే రసాయన డ్రమ్ములు నిల్వ చేస్తున్నట్లు బయటపడింది.
ఇదీ జరిగింది : హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో వ్యాపారి, బాలాజీ రెసిడెన్సీ యజమాని అయిన రమేశ్ జైశ్వాల్.. ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడిరసాయనాల(Petro Chemicals) విక్రయాలు చేస్తున్నారు. ఇందుకుగానూ నాంపల్లి రెడ్‌హిల్స్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 25 ఏళ్లుగా సమీపంలోని బాలాజీ రెసిడెన్సీలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను గోదాముగా మార్చి రసాయన డ్రమ్ములు, ముడిసరకును పెద్దమొత్తంలో నిల్వ చేస్తున్నారు.
Nine Killed in Fire at Nampally in Hyderabad : ఇందులో మిగిలిన 4 అంతస్తులను నివాస గృహాలుగా 9 కుటుంబాలకు అద్దెలకు ఇచ్చారు. ఇటీవల గ్రౌండ్‌ఫ్లోర్‌లో 150కి పైగా రసాయన డ్రమ్ములను నిల్వచేశారు. సోమవారం ఉదయం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Electrical Short Circuit) సంభవించడంతో నిప్పురవ్వలు రేగి మంటలు వ్యాపించాయి. రసాయన డ్రమ్ములు పక్కనే ఉండటంతో భారీ పేలుడు సంభవించి. దీంతో పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలింది.
ఉదయం కావడంతో అప్పుడే నిద్రలేచిన కుటుంబాలు మంటలు, విషవాయువులు, దట్టమైన పొగ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరయ్యాయి.. మొదటి అంతస్తులో ఉంటున్న కొందరు అతికష్టం మీద మెట్ల మీదుగా బయటకు పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. విద్యుత్ నిలిపివేయడంతో అపార్టుమెంట్లో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో 2, 3 అంతస్తుల్లో ఉన్న కుటుంబాలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
9 People Died in Fire Accident at Nampally : విషవాయువు పీల్చి మెట్లపైనే స్పృహతప్పి పడిపోయిన ఇద్దరు బాధితులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటికి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. రెండు, మూడు అంతస్తుల్లో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు, మరో కుటుంబానికి చెందిన మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో అగ్నిప్రమాదం- మంటల్లో చిక్కుకుని 9 మంది కార్మికులు మృతి