ప్రస్థుత పరిస్థితుల్లో విద్యాసంస్థలను పునఃప్రారంభించడం ఎంత ముఖ్యమో.. పిల్లల ప్రాణాలను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు.. మహమ్మారి బారిన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని, త్వరలో స్కూల్స్ రీఓపెన్‌పై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో.. ప్రభుత్వానికీ అంతే బాధ్యత ఉంటుందన్నారు.
జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని మంత్రి ఛాంబర్‌లో.. ఐ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిడ పాల్గొన్నారు. ఉత్తమ గణిత ఉపాధ్యాయులకు.. 'గణిత భూషణ్' అవార్డులను అందజేశారు. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి.. వారిని సత్కరించడం శుభపరిణామమన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వచ్చిన డిజిటల్ తరగతుల బోధనలో.. ఉపాధ్యాయుల పాత్ర గొప్పదంటూ కొనియాడారు.
కరోనా కారణంగా.. విద్యా రంగమే ఎక్కువ నష్టపోయిందన్నారు మంత్రి. నూతన సంవత్సరంలో మహమ్మారి అంతమై.. అంతా మంచే జరగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జనవరి 2 నుంచి ఇంటర్ కళాశాలలు?