అక్టోబరు 3 నుంచి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డివిజన్ యాత్ర చేపడుతున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉదయం ఒక డివిజన్, సాయంత్రం ఒక డివిజన్ తిరుగుతానని తెలిపారు. తెరాస విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్యపరుస్తానని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే కేటీఆర్ సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పి 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలుచుకున్నారని పేర్కొన్నారు. తెరాస మాటలను నమ్మి ఆశతో ప్రజలు ఓట్లేస్తే.. గ్రేటర్‌లో ఇప్పటివరకు కేవలం 128 ఇళ్లు మాత్రమే కట్టారన్నారు.
అద్భుతాలు సృష్టించినట్లు కేటీఆర్ గొప్పలు చెబుతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు వేయలేదు. పురపాలక మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదు. గ్రేటర్‌ను ఇస్తాంబుల్ చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదలపై రూ.1200 కోట్ల భారం పడింది. కేటీఆర్ ముక్కు మూసుకోకుండా మూసీ వెంట తిరిగితే దేనికైనా మేము రెడీ.
-రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్