ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దురదృష్టకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సనాతన సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించాలని కోరినా... సీఎం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఎంపీ విమర్శించారు. కొవిడ్ దృష్ట్యా బాధ్యతతో వ్యవహరించాల్సిన సీఎం.. నిర్లక్ష్యంగా మాస్కు కూడా ధరించలేదన్నారు. ముఖ్యమంత్రే ఇలా చేస్తే ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ఎంపీ ప్రశ్నించారు.
ఏపీ ఖ్యాతి దిగజార్చారు..
మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీ, యూపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎంపీ రఘురామ హితవు పలికారు. మంత్రిగా కాదు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశానని కొడాలి అనడం బాధాకరమన్నారు. మనోభావాలు దెబ్బతీసేలా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మంత్రిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడి దాడి చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. ఏపీ ఖ్యాతి దిగజారేలా వ్యవహరించవద్దని సూచించారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని వైకాపా ఎంపీలు ప్రస్తావించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అన్ని మతాలను సమానంగా చూడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు.
ఇదీ చదవండి : 'గాంధీ, ఉస్మానియా తర్వాత మహబూబ్‌నగర్‌లోనే'