MP Komati Reddy in Vari Deeksha: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను పక్కనబెట్టి.. కేసీఆర్ యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని.. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో ముఖ్యమంత్రి పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద కిసాన్ కాంగ్రెస్ తలపెట్టిన రెండు రోజుల వరి దీక్ష(kisan congress vari deeksha) కార్యక్రమంలో కోమటి రెడ్డి పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణను ఇచ్చిన పార్టీగా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. ఇందిరాగాంధీ చేయలేని ధైర్యాన్ని సోనియా గాంధీ చేసి తెలంగాణ ఇచ్చారు. దిల్లీకి వెళ్లేటప్పుడు కేసీఆర్.. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అడగలేదు. ఆయనలా మేము దిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోం... ప్రధాని ఆఫీసు ముందు కూర్చుంటం. -కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ
నూతన సెక్రటేరియట్‌కు ఖర్చవుతున్న నిధులు.. రైతులకు ఉపయోగపడేవని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఓ వైపు రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే.. తెరాస మంత్రులు ఎమ్మెల్సీ క్యాంపులకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రైతుల సమస్యలపై గళం వినిపిస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులను పట్టించుకోని తెదేపా అధినేత చంద్రబాబు పని ఏమైందో అందరూ చూస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఉచిత కరెంట్ ఇస్తే.. కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకోవాలా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కానీ వైఎస్ ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించారు. రైతులతో పెట్టుకోవద్దని తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. -కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ
ఇదీ చదవండి: Congress vari Deeksha: రైతులంతా వరే వేసుకోండి.. ఎలా కొనరో మేమూ చూస్తాం: ఉత్తమ్