పేద ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యంగా ఉస్మానియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. పాత భవనం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు 90 వేలకు పైగా ఆపరేషన్లు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం 40 వేలు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే ఉస్మానియా ఆసుపత్రి, కళాశాలకు నూతన భవనాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
వారసత్వ సంపద సాకుతో పాత భవనాన్ని కూల్చకుండా... కొత్తది కట్టకుండా అలసత్వం ప్రదర్శించవద్దని ఒవైసీ కోరారు. ఇటీవల నగరంలో మూడు ఆసుపత్రులు, అనుబంధ మెడికల్ కళాశాలల భవనాలపై సీఎం ప్రకటన చేసిన నేపథ్యంలో... ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని అసదుద్దీన్ సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్‌ని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైతే పాత భవనాన్ని కూలగొట్టి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని తెరాస ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం కేసీఆర్‌జీ మనకు వారసత్వ సంపద ముఖ్యం కాదు... పేద ప్రజల ప్రాణాలే ముఖ్యమని మీకు తెలుసు. కరోనా మహమ్మారితో జీహెచ్ఎంసీలో అత్యధిక ప్రజలు ప్రాణాలు విడిచారు. తాజా నివేదిక ప్రకారం పాతబస్తీలో అత్యధిక కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికైనా వారసత్వ సంపద సాకు చెప్పకుండా తక్షణమే ఉస్మానియా ఆసుపత్రి, కళాశాలకు నూతన భవనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.-
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఇదీ చదవండి: KTR: సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... ఎందుకంటే..