ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయ్ సింహా ప్రమేయం ఉందని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపింది. తమకు సంబంధం లేదంటూ సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయాలని కోరుతూ అనిశా... కోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఓటుకు నోటు కేసుపై అనిశా ప్రత్యేక న్యాయస్థానం రోజువారీ విచారణ చేపట్టింది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు ఎక్కడా లేదని సండ్ర వెంకటవీరయ్య కోర్టుకు విన్నవించారు. మొదటి ఛార్జ్‌షీట్‌లోనూ తన పేరు లేదన్నారు. ఆ తర్వాత ఛార్జ్‌షీట్‌లో తనను అనవసరంగా లాగారని పిటిషన్‌లో సండ్ర వెంకటవీరయ్య ప్రస్తావించారు. సండ్ర వాదనల్లో నిజం లేదని కౌంటరులో అనిశా స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య తదితరులతో కలిసి కుట్ర పన్నారని కోర్టుకు తెలిపింది. ఆధారాలున్నందునే సండ్ర వెంకటవీరయ్యను అరెస్టు చేసి... 2017లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని అనిశా వివరించింది.
మరో నిందితుడు ఉదయ్ సింహాకు సంబంధించిన ఆధారాలున్నాయని డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయాలని అనిశా విజ్ఞప్తి చేసింది. ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 27కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మొక్కజొన్న పంటకు మద్దతు ధర కోసం కామారెడ్డిలో రైతుల ధర్నా