ఖైరతాబాద్ గణేశుడి ఆశీస్సులతో తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆకాంక్షించారు. గణేశ్ చతుర్థిని పురస్కరించుకొని ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహాగణపతిని దర్శించుకున్న దానం... భక్తులు కరోనా వైరస్ బారిన పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
భక్తులంతా భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లోనూ ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటుకు అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాల కేటీఆర్ అర్హుడని వ్యాఖ్యానించారు. అంతకుముందు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ ధన్వంతరి గణపతికి తొలిపూజ నిర్వహించి గజమాలతోపాటు కండువాను సమర్పించారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజర్‌తోపాటు శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్