MINISTERS VISIT MUSARAMBHAG BRIDGE: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన మూసారంబాగ్ వంతెన పనులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. వంతెనపై ఉన్న చెత్త చెదారం తొలగించి.. రోడ్డు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. హైదరాబాద్లో గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే పూర్తి చేశామని తెలిపారు. ఫ్లైఓవర్లు నిర్మాణంతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని చెప్పారు.
త్వరలోనే ముసారాంబాగ్, చాదర్ ఘాట్ నూతన వంతెనల నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ముసారాంబాగ్ వంతెనకు రూ.52 కోట్లు, చాదర్ఘాట్ వంతెనకు రూ.42కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కొద్ది రోజుల్లోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని చెప్పారు. వరద ముంపు తీవ్రతను తగ్గించడానికి జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
హైదరాబాద్లో గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు. తమ ప్రభుత్వ పనితీరును చూసైనా ప్రతిపక్ష నాయకులు ఆలోచించి మాట్లాడాలని మంత్రి తలసాని వారికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
"మూసారంబాగ్, చాదర్ఘాట్ వంతెనలు ప్రధానమైనవి. ఈ మధ్య కాలంలో భారీ వర్షాలు కురిశాయి. మూసారాంబాగ్ వంతెనకు రూ.52 కోట్లు, చాదర్ఘాట్ వంతెనకు రూ.42కోట్లు మంజూరయ్యాయి. పదిరోజుల్లోనే టెండర్లు పిలిచి పనులు చేపడతాం." - తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి