రాష్ట్రంలో వీలైనంత త్వరలో సినిమా, టీవీ ధారావాహికల చిత్రీకరణలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని కమ్యూనిటీ హాల్లో సినీ, టీవీ పరిశ్రమ కార్మికులకు పంపిణీ చేసేందుకు సమకూర్చిన నిత్యావసర సరుకుల సంసిద్ధతను మంత్రి పరిశీలించారు.
ప్రస్తుతం ఎన్ని చిత్రాలు చిత్రీకరణకు సిద్ధంగా ఉన్నాయో ఆ జాబితాను సిద్ధం చేయాలని సినీ పరిశ్రమ పెద్దలకు సూచించినట్లు మంత్రి పేర్కొన్నారు. సినిమా థియేటర్లు పునరుద్ధరించే అంశంపై ఫిలింఛాంబర్ పెద్దలతో మాట్లాడి.. ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వంటి పరిణామాల నేపథ్యంలో.. ఆయా విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో సుమారు 14 వేల మంది సినీ, టీవీ పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు టీవీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.