బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం సీట్లు అని కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్తామనడం.. ఎన్నికల నుంచి కాంగ్రెస్ పారిపోయిందనేందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలన బీసీలకు స్వర్ణయుగమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలను నిలబెట్టిన ఘనత తెరాసదేనని పేర్కొన్నారు. కుల వృత్తులను పరిరక్షిస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆరేనని అన్నారు. కాంగ్రెస్కు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకొస్తారని ఆరోపించారు. బండి సంజయ్, అర్వింద్ భాష తీరు మార్చుకోవాలని.. సీఎంను ఏకవచనంతో సంబోధించడం మంచిది కాదని తలసాని పేర్కొన్నారు. భాజపా నేతలు భాష మార్చుకోక పోతే తాము కూడా ప్రధాని మోదీకి అదే భాషలో జవాబిస్తామని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రొటోకాల్ కోసం హైదరాబాద్ వస్తున్నారు తప్ప.. నిధులు తేలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్కు కేంద్ర బృందం వచ్చినా.. వరద సాయం మాత్రం రాలేదన్నారు. గొల్ల, కురుమలు తొందర పడవద్దని.. గొర్రెల పంపిణీ త్వరలోనే చేపడతామన్నారు. దుబ్బాకలో తెరాస మంచి మెజారిటీతోనే గెలుస్తుందని.. ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లేనని తలసాని వ్యాఖ్యానించారు.
- ఇదీ చూడండి: రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్: ఎమ్మార్వో