తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్ టీఎన్జీవో కేంద్ర సంఘం భవన్‌లో ఆ సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన అన్ని హెచ్‌ఓడీల ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిధిగా మంత్రి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యోగులు పాల్గొని రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని మంత్రి కొనియాడారు. గత పాలకులు దశాబ్దకాలంగా పట్టించుకోని ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి అనేకం పరిష్కరించుకున్నామని తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కరించుకుందామని శ్రీనివాస్ గౌడ్ భరోసా ఇచ్చారు.
ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ ఉద్యోగుల అండ ఉంటుందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ అన్నారు. కొంతకాలంగా మిగిలిన సమస్యలు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీర్చలేకపోయామని వాటిని అతి త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకండి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.