తెలంగాణ రాష్ట్రం కళల ఖజానా అని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివర్ణించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్-టిటా సహకారంతో ప్రత్యేకంగా రూపొందిన టీ-కల్చర్ మొబైల్ యాప్‌ను సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస్‌రాజుతో కలసి రవీంద్రభారతిలో మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎంతో మంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారని... వారిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
కళాకారులకు గుర్తింపు కార్డులు...
రాష్ట్రం ఏర్పడిన తరువాత కళాకారులకు సీఎం కేసీఆర్ గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. మధ్యవర్తులతో సంబంధాలు లేకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
పూర్తి వివరాలతో డేటా బేస్...
కళాకారుల డేటా బేస్‌ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి వివరాలను యాప్ ద్వారా కళాకారుల సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈ మొబైల్ యాప్‌ను తెచ్చినట్లు మంత్రి వివరించారు. కళాకారులకు గుర్తింపు కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని మీ సేవాతో అనుసంధానం చేసినట్లు తెలిపారు.