తెలంగాణను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాసనసభకు వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన మంత్రి.. గతంలో పర్యాటకం అంటే ప్రైవేట్‌పరం చేయడమేనని భావించారని విమర్శించారు. రాష్ట్రంలో 246 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, లక్నవరం మూడో ద్వీపంలో ఎకోటూరిజం పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సోమశిల, సింగోటం రిజర్వాయర్‌లు, అక్కమహాదేవి గుహలు, ఈగలపెంట, మన్ననూర్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వర ఆలయం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగత జలపాతం, బమ్మెరపోతన, పాకాల, అలీసాగర్, జోడెఘాట్, కొమురంభీమ్ మెమోరియల్ పార్క్, కేసీఆర్ అర్బన్ ఎకోపార్క్ పనులు చేపట్టామన్నారు. వీటితో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలోనూ అర్భన్ పార్కులు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాల నుంచి వినతులు వస్తున్నాయన్న మంత్రి నియోజకవర్గాల్లోనూ పర్యాటక రంగానికి ప్రాధన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చదవండి : 'ఈ ఏడాదిలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తి'