పార్లమెంట్‌లో కేంద్రమంత్రులు తలో మాట చెబితే రాష్ట్ర భాజపా నేతలు పచ్చి అబద్ధాలతో రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోందని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ విధానాల మూలంగా నష్టపోకుండా రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని కోరారు.
కార్పొరేట్లకే కేంద్రం సాయం
కేంద్రం మోసపూరిత విధానాలను పసిగట్టిన ప్రభుత్వం రైతులు ఆరుతడి పంటలు పండించాలని అప్రమత్తం చేస్తోందన్నారు. ఈ మేరకు మంత్రి రైతులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఇస్తున్న సహకారం రైతాంగానికి ఇవ్వడంలేదని... రాష్ట్ర రైతాంగం కేంద్రం అవలంభిస్తున్న భిన్న వైఖరులను గమనించాలని మంత్రి వివరించారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందన్నారు.
బోర్ల నుంచి బావుల ద్వారా వ్యవసాయం
సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగిందని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం బావుల్లో పుష్కలంగా నీరు లభించే రోజులొచ్చాయన్నారు. సీఎం మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. సీఎం కేసీఆర్ విధానాలతో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని మంత్రి తెలిపారు. సాగుభూమి ఏడేళ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. 2020-21 నాటికి ధాన్యం 3 కోట్ల టన్నులకు చేరిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: