ssc exams review: పదోతరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పరీక్ష కేెంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 23నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 5,09,275మంది విద్యార్థులు హాజరుకానున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 2861పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి హాల్ టికెట్లు పొందాలని మంత్రి పేర్కొన్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తను అందుబాటులో ఉంచాలన్నారు. ఓఆర్‌ఎస్ పాకెట్లు అవసరమైన మందులతో సిద్దంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తడిచిన ధాన్యం ఎవరు కొంటారని అన్నదాతల ఆవేదన
గుడ్న్యూస్.. దేశంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఇక వానలే వానలు!