Minister Prashanth reddy: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్దరణకు.. సీఎం ఆదేశాల మేరకు రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు.. కోతకు గురైన రోడ్ల గురించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారుల పరిస్థితి గురించి ఈఎన్సీ రవీందర్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర రహదారులు 1733 కిలోమీటర్ల పొడవున దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు రూ.379.50 కోట్లు, తెగిపోయిన 8.4 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు రూ.13.45 కోట్లు.. 39.8 కిలోమీటర్ల పొడవైన కోతలకు గురైన రోడ్లుకు గాను రూ.7.10 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న 412 కల్వర్టుల మరమ్మత్తులకు రూ.98.19 కోట్లు.. శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులకు మొత్తం కలిపి రూ.498.24 కోట్లు ఖర్చు అవుతాయని సంబంధిత ఇంజనీర్లు రూపొందించిన అంచనాలను మంత్రి పరిశీలించారు.