Minister Perni On RRR Movie: ఆంధ్రప్రదేశ్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్లపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ చెల్లించిన తర్వాత ప్రత్యేక టికెట్ రేట్లకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరలను నిర్ధారిస్తూ జీవో నెం.13ను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. రూ.100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు 10 రోజుల పాటు ప్రత్యేక టికెట్ నిర్ధారించుకునేలా ఆదేశాలిచ్చామన్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు దరఖాస్తు వచ్చిందని..,రూ.336 కోట్లతో సినిమా నిర్మించినట్లు దర్శక నిర్మాతలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. జీవో కంటే ముందే 'ఆర్‌ఆర్‌ఆర్' నిర్మించిన కారణంగా రాష్ట్రంలో 20 శాతం షూటింగ్ నిబంధన ఈ సినిమాకు వర్తించదని చెప్పారు. కొత్తగా నిర్మించే సినిమాలకు నిబంధనలు వర్తించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జగన్‌తో రాజమౌళి భేటీ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఇటీవల భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి స్పష్టం చేశారు.
మార్చి 25న ప్రేక్షకుల ముందుకు..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్'..మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
ఇదీ చూడండి: రాజమౌళి 'నాటు' డాన్స్.. ఆ రోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్