హైదరాబాద్ బషీర్ బాగ్ వ్యవసాయ కమిషనరేట్‌లో వ్యవసాయ శాఖ యూనిట్ క్యాలెండర్ - 2020ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, టీఎన్జీఓ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెచ్చేందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అవసరమైన చోట పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏ శాఖలో చేరితే అందులోనే పదవీ విరమణ పొందుతామన్న ధోరణి ఉండొద్దని... అది సహేతుకం కాదని చెప్పారు.
ఉద్యోగుల కొరత విషయం, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలని సీఎం తీసుకున్నారని గుర్తు చేశారు. రైతుబీమా, రైతుబంధు, సాగునీరు, వ్యవసాయానికి ఉచిత కరంటు వంటివి ఎంతో ప్రశంసలు పొందాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల వివరాలు మొత్తం అందుబాటులో ఉండడం అభినందనీయమన్నారు. పథకం అమలులో దళారుల బెడద లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతుల వివరాలు సమగ్రంగా అందుబాటులో ఉండడంవల్లనే కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ యోజన విజయవంతంగా అమలు చేయగలిగిందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: పర్యటక కేంద్రాలకు 'తేజస్' రైళ్లు.. కొత్తగా 100 విమానాశ్రయాలు!