భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన దీక్షపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. వంద శాతం వ్యవసాయ ఉత్పత్తులు కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని... భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ తరహాలో కొనుగోళ్లు జరుగుతున్నాయని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకునే కేంద్రం... పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి రూపొందించి అమలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించుకోవాలని ఎద్దేవా చేశారు.
పిడుగులు పడడం, వర్షాలు రావడం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతున్నదేనని, ఒక్క తెలంగాణకే పరిమితం కాదని మంత్రి హితవు పలికారు. రాష్ట్రంలో 12,500 గ్రామపంచాయతీల్లో పంటల సాగు పరిగణనలోకి తీసుకొని 7,077 ధాన్యం, 1,027 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. ఇప్పటికే... 5,187 ధాన్యం, 923 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని వివరించారు.
ఇదీ చూడండి: వాట్సప్ చాట్‌బోట్ సేవలు ఇప్పుడు ఉర్దూలో!