హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న రాష్ట్రప్రభుత్వ నిబద్ధతకు మరింతబలం చేకూర్చేలా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి భాగ్యనగరం భవిష్యత్‌పై స్పష్టమైన ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి కృషిచేస్తూ వస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా అనేకచోట్ల ట్రాఫిక్‌రద్దీ తగ్గించేలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినట్లు వివరించారు.
ప్రభుత్వం చొరవతో మెట్రోరైల్ పూర్తిచేశామన్న కేటీఆర్... రెండోదశకు వేగంగా ప్రణాళికలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ సహకారంతో త్వరలోనే కార్యరూపం దాలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.10 వేలకోట్ల నిధులతో నగరాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న నాలుగేళ్లపాటు... ఏటా రూ.10 కోట్లు ప్రభుత్వం కేటాయించనున్నందున హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుని పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక ప్రపంచ కంపెనీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ను... ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని... ఆ దిశగా తమ ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తుందని కేటీఆర్ తెలిపారు.