KTR comments in CII Meeting : పరిశ్రమల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పులు అవసరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలని కోరారు. స్వతంత్ర భారత్‌లో విజయవంతమైన స్టార్టప్.. తెలంగాణే అని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్.. తెరాస పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని వివరించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో తెలిపారు
ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్టక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ నినాదాలతో... రాష్ట్రప్రభుత్వం అనేక విధానాలను తీసుకొచ్చినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం 2021-22లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తొలిచట్టం చేసినట్లు గుర్తుచేశారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతిచ్చేలా టీఎస్ ఐపాస్ చట్టం రూపొందించామని వివరించారు.
20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో పెద్దగా కంపెనీలు లేవన్న కేటీఆర్. ప్రస్తుతం హైదరాబాద్‌కు అనేక ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన మంత్రి.. పరిశ్రమల విషయంలో కేంద్ర విధానాలు సరిగా లేవని ఆరోపించారు. కేంద్రం రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోందని మండిపడ్డారు. కరోనాతో దెబ్బతిన్న చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు సమర్థ ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
'చైనాలోని షిజో అనే ప్రాంతంలో 70 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఉంది. ఎక్కువ విస్తీర్ణంలో ఉండటం వల్ల వస్తువును ఉత్పత్తి చేసే విలువ తగ్గుతుంది. భారత్‌లో అంత పెద్ద పారిశ్రామిక పార్కు ఉందా? రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారులో 14 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు పెట్టేందుకు కృషి చేస్తుంది. కేంద్రాన్ని సాయం చేయమని కోరినా సరైన సహకారం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవు. వేగవంతమైన విధానాలు తీసుకురావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలున్నాయని అక్కడే పరిశ్రమలు స్థాపిస్తామంటే ఎలా? 20 లక్షల కోట్ల రూపాయలతో కేంద్రం తెచ్చిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ అందరినీ నిరాశపరిచింది. ఎవరికి ఉపయోగపడిందో వారే చెప్పాలి. గడిచిన ఏడాది లక్షల కొద్దీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్రంతో పోరాడాలని సీఐఐ ప్రతినిధులను కోరుతున్నా. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కేంద్రంతో నేరుగా మాట్లాడండి.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఒకే భాష మాట్లాడే రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా ఎందుకు ఏర్పాటు చేయాలని గతంలో చాలా మంది మిత్రులు అడిగారని కేటీఆర్ చెప్పారు. వారందరికి సమాధానం... ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1.24 లక్షల నుంచి ప్రస్తుతం 2.78 లక్షలకు చేరిందని తెలిపారు. ఏడేళ్లలో తలసరి ఆదాయం రెండింతలు అయిందన్న కేటీఆర్.. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ మెరుగ్గా ఉందన్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణదేనని స్పష్టంచేశారు.
'రాష్ట్రం ఏర్పడినప్పడు జీఎస్‌డీపీ 5 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం 11.54 లక్షల కోట్లకు పెరిగింది. 130 శాతం మేర జీఎస్‌డీపీలో వృద్ధి సాధించాం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణ. రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశ జీడీపీకి 5 శాతం సమకూరుస్తుంది. రెట్టింపు గణాంకాల వల్లే స్వతంత్ర భారత్‌లో విజయవంతమైన స్టార్టప్ తెలంగాణే అని నేను చెప్పగలను.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టైన కాళేశ్వరాన్ని నాలుగున్నర ఏళ్లలో పూర్తి చేశామన్న కేటీఆర్ వ్యవసాయ రంగంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారామని తెలిపారు. తెలంగాణలో తీసుకొచ్చిన ఎన్నో పథకాలను కేంద్రం అనుసరిస్తోందని చెప్పారు.
'పారిశ్రామిక రంగంతోపాటు వ్యవసాయ రంగాన్ని మరిచిపోలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్‌డీపీలో 15 శాతం ఉన్న వ్యవసాయ రంగం వాటా ప్రస్తుతం 21 శాతానికి పెరిగింది. 5 శాతం వృద్ధిచెందింది. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని సేకరించలేక ఒకానొక దశలో ఎఫ్‌సీఐ సైతం చేతులు ఎత్తేసింది.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
హరితహారంలో భాగంగా మెుక్కలు నాటిన సంస్థలకు మంత్రి కేటీఆర్ హరితహారం అవార్డులు అందించారు. ఇప్పటివరకు సీఐఐ ప్రతినిధులు 21.46 లక్షల మొక్కలు నాటారు. ఐటీసీ పేపర్ బోట్స్, ప్రగతి రిసార్ట్స్, కన్హా శాంతివనం, సియంట్, ఐఐటీ హైదరాబాద్, బోయినపల్లి కేంద్రీయ విద్యాలయ, డీపీఎస్ స్కూల్స్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ మొక్కలు నాటాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్ విశ్వనగరం కావాలనే కేసీఆర్ ఆకాంక్ష మేరకు పనులు: కేటీఆర్