KTR Review on Handloom and Textile: హైదరాబాద్ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశించారు. శాఖకు సంబంధించి బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించిన మంత్రి... వివిధ కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై చర్చించారు. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్న కేటీఆర్... వారికి అత్యంత సులువుగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నేతన్నల ఆదాయం, వృత్తి నైపుణ్యం పెంచేందుకు చర్యలు చేపట్టండి: పథకాలు మరింత సులభంగా అందేలా నేతన్నల సూచనల మేరకు అవసరమైన మార్పులు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. టెక్స్ టైల్ పార్కులు, మినీ టెక్స్ టైల్ పార్కులు, అప్పారెల్ పార్కుల్లో మిగిలిపోయిన పనులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కేటీఆర్ స్పష్టం చేశారు. బ్లాక్ లెవల్ క్లస్టర్ల పనితీరు, వాటి పురోగతిపై నివేదిక వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చేనేత రంగంలోని నేతన్నల కళ, వృత్తికి మరింత ఆదాయం వచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులపై క్షేత్రస్థాయిలో మరింత అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆగష్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని.. ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఉపాధి కోసం నేతన్నలు విస్తృతంగా ఆధారపడిన పవర్ లూమ్ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
తిర్పూర్ తరహాలో పవర్ లూమ్ క్లస్టర్ల అభివృద్ధికి అధ్యయనం: దేశంలోనే అత్యంత ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్ క్లస్టర్ తరహాలో సమీకృత పద్ధతిన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్ లూమ్ క్లస్టర్లను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అక్కడ పర్యటించి ఆదర్శవంతమైన పద్ధతులను, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకున్న తీరు, అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని సూచించారు. తిర్పూర్ లాంటి పవర్ లూమ్ క్లస్టర్ల స్ఫూర్తితో తెలంగాణలోనూ నేతన్నల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు, వారి ఆదాయాలను మరింత పెంచేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణను వెంటనే ప్రతిపాదించాలని టెక్స్ టైల్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: