స్వయం సమృద్ధి సాధనకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు స్ఫూర్తిదాయకమని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ నిర్వహించిన అమెరికా సదస్సులో ప్రసంగించారు. వివిధ రంగాలలో స్వయం సమృద్ధి సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల నుంచి ఇతరులు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన... తెలంగాణకు పెట్టుబడులు అకర్షించడం నుంచి మొదలు పరిపాలన, పథకాల వరకు ఇప్పటిదాకా తెలంగాణ స్వయంసమృద్ధి సాధించే దిశగా ముందుకు పోతుందని వివరించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ అనేక అవకాశాలు ఉన్నాయని, దీనికి సంబంధించి భారతదేశం పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఒకే రీతిలో చూడకుండా, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలు, ఆయా రాష్ట్రాల పాలసీల ఆధారంగా పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా రాష్ట్రాలతో మరింత పెద్ద ఎత్తున ఎంగేజ్ కావాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం టీఎస్ ఐపాస్ విధానం ప్రవేశపెట్టి కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణకు వచ్చేలా చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కలిపి తెలంగాణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో స్థానం కల్పిస్తే కచ్చితంగా టాప్-20లో ఉండే అవకాశం ఉందన్నారు.
భారత్‌కు దేశ యువశక్తి అత్యంత ఆకర్షణీయమైన వనరు అని, ఇక్కడ ఉన్న నైపుణ్యత ఆధారంగా అనేక కంపెనీలు పెట్టుబడులు వచ్చేందుకు ముందుకు వస్తాయని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకుంటూనే పనిచేసుకునే వీలు కల్పించే డ్యుయల్ డిగ్రీ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో నూతన ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లాళ్సిన అవసరం ఉందని.. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం భారతదేశానికి చెందిన అతిపెద్ద ఇంకుబేటర్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్‌ను, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, టీ వర్క్స్ వంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల్ని ప్రస్తుతం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగంలో ప్రఖ్యాత కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెల్త్ కేర్, వ్యవసాయ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చే ఎవరికైనా ప్రాధాన్యం ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇవీచూడండి: ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్