రాష్ట్రంలో విద్యుత్ వాహనాల విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? విద్యుత్ వాహన పరిశ్రమ, వాహనదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై మండలిలో చర్చ జరిగింది. దీనిపై స్పందించిన కేటీఆర్... ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చదనానికి, పర్యావరణహితానికి కృషి చేసే వ్యక్తి అని తెలిపారు.
''భారత దేశ రాజకీయ చరిత్రలోనే పర్యావరణహిత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టిన వ్యక్తి కేసీఆర్. ఈ క్రమంలోనే హరితహారం, ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకువచ్చారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ 23 శాతం నుంచి 28 వరకు వచ్చిందంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమైంది. ఈ నివేదిక మేము చెప్పేది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పర్యావరణమంటే మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే కాలుష్య రహితమైన.. సాంప్రదాయక వాహనాలపై కేసీఆర్ దృష్టి సారించారు. విదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో రవాణాశాఖతో కలిసి పరిశ్రమల శాఖ చాలా రీసెర్చే చేసింది. అక్టోబర్ 2020లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడం ప్రారంభించింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం చేవెళ్లలో 1200 ఎకరాల్లో ఒక క్లస్టర్ని... మంత్రి శ్రీనివాస్గౌండ్ నియోజవర్గంలోని దివిటిపల్లిలో 500 ఎకరాల్లో మరో క్లస్టర్‌ను ఏర్పాటు చేశాము. అదీకాక జహీరాబాద్‌లో నిమ్జ్ (NIMZ) కూడా ఉంది. కరోనా సమయంలో కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. దాదాపు రూ. 5,600 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం స్వాగతించింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఎంత దూరం ఆలోచిస్తుందంటే... ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియంను రాష్ట్రంలోనే తయాలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు లిథియంను చైనా నుంచే కొనుగోలు చేసే వాళ్లం. టీఎస్‌ఎమ్‌డీసీ (TSMDC) ద్వారా ప్రొడ్యూస్ చేసేందుకు కృషి చేస్తున్నాం.''
-మంత్రి కేటీఆర్
ఇప్పటివరకు రాష్ట్రంలో 6,311 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరిగాయని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు కలిపి 98 ప్రాంతాల్లో 111 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. టీఎస్ రెడ్ కో సంస్థ.. మరో 600 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేసే యోచనలో ఉందని వెల్లడించారు. రైతులకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అలవాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. మహేంద్ర సంస్థ ఏడాదికి 1,50,000 సాంప్రదాయక ట్రాక్టర్స్‌ను తయారు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Harish Rao: ఓటేసి ముందు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి వెళ్లండి