సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు అవసరమని కేటీఆర్ తెలిపారు.
గతేడాది అనేక ఇబ్బందులు
గత ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున విస్తరించాయని.. కరోనా, లాక్డౌన్ వల్ల ఈ ఎంఎస్ఎంఈలు గతేడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో చిన్నపరిశ్రమల పరిస్థితి దీనంగా మారిందన్నారు. పరిశ్రమల కార్యకలాపాలపైన లాక్డౌన్ సమయంలోనూ తెలంగాణ ఎలాంటి పరిమితులు విధించలేదని గుర్తు చేశారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఎంఎస్ఎంఈలకు అవసరమైన ముడి సరుకుల సరఫరా సకాలంలో అందకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్లిపోవడం, ఎంఎస్ఎంఈలు తయారు చేసిన తమ ఉత్పత్తులను తన కస్టమర్లకు అందించడంలో ఎదుర్కొన్న రవాణా ఇబ్బందుల వంటి కారణాలతో వాటి కార్యకలాపాలు స్తంభించిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మద్దతు అందించండి..
ఇలా ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల రుణాల చెల్లింపుపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించడం, అప్పటిదాకా రుణాలపైన వడ్డీని ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకుంటే ఆయా ఎంఎస్ఎంఈలకు ఉపయుక్తంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి మద్దతు అందించగలిగితే కరోనాకు ముందు ఉన్న పూర్వస్థితికి ఎంఎస్ఎంఈలు చేరుకుంటాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచిస్తున్న ఈ సహాయక చర్యలు వెంటనే చేపట్టాల్సిందిగా మంత్రి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: JAGAN LETTER: మోదీకి జగన్ మరో లేఖ.. తెలంగాణ నీటి వాడకం ఆపేలా చర్యలు చేపట్టాలని వినతి