KTR Delhi tour latest updates : తెలంగాణలో అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు అంశాలు గురించి కేంద్ర మంత్రులకు వివరించడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్.. ఇవాళ మరో ఇద్దరు కేంద్రమంత్రులను కలిశారు. ముందుగా పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరిని కలిశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరినట్లు సమాచారం.
KTR meet with Piyush Goyal : లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రో లైన్‌కు ఆమోదం తెలిపి, నిధులు అందించాలని కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లింక్‌రోడ్ల పనులకు సంబంధించి వివరాలు అందించి సాయం కోసం విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన కేటీఆర్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
గతంలో ఇచ్చిన ధాన్యం సేకరణ పరిమితిని రెట్టింపు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఉప్పుడు బియ్యం సేకరణ పరిమితిని కూడా పెంచాలని కోరారు. రాత్రి 10గంటల 15నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ కేటీఆర్ బృందం భేటీ కానుంది. హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధి హోంశాఖ పరిధిలోని భూముల కేటాయింపుపై విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
KTR Special Interview : శుక్లవారం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం విలేకరులతో కేటీఆర్ ముచ్చటించారు. దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న ప్రశ్నపై ఆయన జవాబు ఇచ్చారు. దేశ రాజకీయాలు దిల్లీ కేంద్రంగానే సాగాలని అనుకోవద్దని.. హైదరాబాద్ నుంచే చక్రం తిప్పుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పని చేసిన ప్రధానమంత్రులందరిలో అత్యంత బలహీన ప్రధాని నరేంద్ర మోదీనేనని.. ఆయనకు అవకాశం ఇస్తే దిల్లీని కూడా గుజరాత్‌కు తరలిస్తారని ఎద్దేవా చేశారు.
మోదీని దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారత్ రాష్ట్ర సమితి అని మంత్రి స్పష్టం చేశారు. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ అభిప్రాయమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్నాలో విపక్షాల సమావేశంపై ప్రశ్నించగా.. ‘విపక్ష పార్టీలను ఏకం చేసే రాజకీయాలు కాదు.. ప్రజలను ఏకం చేసే రాజకీయాలను తాము నమ్ముతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: