దేశంలో విప్లవాత్మక మార్పులను మోదీ తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో భారత్ శక్తిశాలి దేశంగా ఎదగడమే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. అద్భుతమైన నూతన విద్యా విధానాన్ని మోదీ తెచ్చారని.. ప్రధాని మార్పులు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం బాధాకరమని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై హైదరాబాద్ సోమాజీగూడలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
"వ్యవసాయ రంగానికి కావాల్సిన ఎరువుల కొరత లేకుండా చేశారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. కనీస మద్దతు ధర రద్దు చేయబోమని సీఎం కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా. రైతులకు అన్యాయం చేసే విధంగా విపక్షాలు మాట్లాడవద్దు. నూతన చట్టం ద్వారా రైతు తనకు నచ్చిన వ్యక్తికి, ధరకు అమ్ముకోవచ్చు. దేశంలోని విత్తన వ్యవస్థ కార్పొరేట్ కంపెనీల్లో బందీ కావడానికి కాంగ్రెస్ కారణం కాదా?.
ప్రతి కిలో బియ్యానికి కేంద్రం నుంచి రూ.30 రాయితీ. పంటల బీమా పథకం రాష్ట్రంలో సక్రమంగా అమలు జరగడం లేదు. వ్యవసాయ బిల్లులపై ఏ రైతు సంఘంతోనైనా చర్చకు కేంద్రం సిద్ధం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా విద్యుత్ కొరత ఉందా?. రాష్ట్రానికి రూ.80వేల కోట్లు విద్యుత్ రంగానికి సంబంధించి ఇచ్చాం. బిల్లులో ఎలాంటి పొరపాట్లు లేవు.. రైతు సంఘాలు సూచిస్తే సవరిస్తాం."
-కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ఇదీ చూడండి : కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ