"హరితహారం ఐదు విడతల కార్యక్రమంలో ఇప్పటివరకు 182 కోట్ల మొక్కలు నాటాం. వాటిలో 70 శాతం బతికినట్లు అంచనా. ఈ ఏడాది 30 కోట్లు, వచ్చే ఏడాది 30 కోట్ల మొక్కలు నాటుతాం. దాంతో రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం లక్ష్యాన్ని చేరుకుంటాం. గ్రామాల నుంచి కోతులను వాపస్ పంపించేందుకు అసెంబ్లీ నియోజకవర్గానికి 1-4 మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నాం" అని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
మార్చి-మే నెలల మధ్య అగ్నిప్రమాదాల వల్ల అటవీ సంపదకు భారీగా నష్టం జరుగుతున్న విషయం వాస్తవమేనని, వాటి నియంత్రణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. గురువారం నుంచి ఆరో విడత ‘తెలంగాణకు హరితహారం’ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆరో విడత హరితహారం ప్రత్యేకత ఏంటి?
క్షీణించిన అటవీ ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటి అడవుల్ని పునరుద్ధరించడంపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించాం. 25న నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ఆరో విడత హరితహారం ప్రారంభిస్తారు. గత కొన్నేళ్లలోనూ రాష్ట్రంలో 10 లక్షల హెక్టార్ల అటవీప్రాంతం క్షీణించినట్లు అంచనా. ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటి సహజసిద్ధ అడవుల్ని పునరుద్ధరిస్తాం. 12,500 పంచాయతీల్లో, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖలో నర్సరీలు ఏర్పాటుచేశాం. వాటి నుంచి సేకరించి అన్నిరకాల మొక్కలు నాటబోతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర, జాతీయ రహదారులకు ఇరువైపులా 3 వరుసలతో మొక్కలు నాటుతాం.
గతంలో నాటిన మొక్కలు క్షేత్రస్థాయిలో లెక్కల మేరకు ఉన్నాయంటారా?
సంరక్షణ లేక అక్కడక్కడా మొక్కలు చనిపోతున్నాయి. అది నిజమే. కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చాక భయం, బాధ్యత పెరిగాయి. 85 శాతం మొక్కలను బతికించకపోతే గ్రామ కార్యదర్శిపై వేటు పడుతుంది. సర్పంచి కూడా బాధ్యుడే. ప్రతి పంచాయతీకి ఓ ట్రాక్టర్ కేటాయించడం వల్ల మొక్కలకు నీటిసమస్య పోతుంది.
కొందరు అధికారులు ప్రైవేటు నర్సరీల నుంచి అధిక ధరలకు, టెండర్లు లేకుండా మొక్కలు కొంటున్నారు కదా ఏమంటారు?
కొన్నిచోట్ల కలెక్టర్ అనుమతితో మొక్కలు కొన్నారు. అటవీశాఖ నర్సరీల్లో 3.60 కోట్ల మొక్కలు పెంచుతున్నాం. ప్రైవేటు నుంచి మొక్కలు కొంటే చర్యలు తీసుకుంటాం.
కలప స్మగ్లింగ్‌కు కట్టడి ఎప్పుడు?
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్మగ్లర్లను పీడీ చట్టం కింద అణచివేస్తున్నాం. అడపాదడపా కలప స్మగ్లింగ్ జరుగుతోంది. పోలీసుల సాయంతో పూర్తిగా కట్టడి చేస్తాం. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాం.
రహదారుల విస్తరణ కోసం భారీ వృక్షాల్ని కొట్టేయడానికి అనుమతించడంపై ఏమంటారు?
ట్రాఫిక్ పెరుగుతుండటం వల్ల కొన్నిచోట్ల భారీ వృక్షాలను కొట్టేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వేళ్లతో తొలగించి మరోచోట నాటించాం.