Harish Rao Inaugurated Hospitals: ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరణ చేస్తూ ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మేడ్చల్ పట్టణంలో 100 పడకల మెడినోవా ఆస్పత్రిని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. మేడ్చల్ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలుగా రూ. 10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు హరీశ్ తెలిపారు. ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణా కేంద్రాన్ని రూ. కోటితో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
పట్టణంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని సూచించారు.
మియాపూర్లో
అనంతరం హైదరాబాద్ మియాపూర్‌లోని మాతృశ్రీ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హై లైఫ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని హరీశ్ రావు ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించి సహాయపడాలని మంత్రి సూచించారు. మియాపూర్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన యాజమాన్యాన్ని అభినందించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వైద్య పరీక్షలతో తక్కువ ఖర్చుతోనే రోగులకు వైద్య సేవలందించనున్నామని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. శివ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ప్రణాళికల వల్లే రైతులకు సాగునీటి గోస తప్పింది: ప్రశాంత్ రెడ్డి